‘తడిచెత్త’తో దేశంలో రూ. 4 లక్షల కోట్ల మార్కెట్.. 26 లక్షల ఉద్యోగాలు!

  • 2047 నాటికి 51 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా సేంద్రియ వ్యర్థాలు
  • ఈ రంగంలో 26 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమని అంచనా
  • దాదాపు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం
  • వ్యర్థాలను కంపోస్ట్, బయోగ్యాస్‌గా మార్చడం ద్వారా భారీ ప్రయోజనం
  • కాలుష్యం తగ్గింపు, ఇంధన భద్రతకు దోహదం చేస్తుందని నివేదిక
భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో పోగవుతున్న సేంద్రియ వ్యర్థాలను (organic waste) సరిగ్గా నిర్వహిస్తే, అది 2047 నాటికి 51 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.25 లక్షల కోట్లు) భారీ మార్కెట్‌గా అవతరిస్తుందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) నివేదిక వెల్లడించింది. దీని ద్వారా సుమారు 26 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించవచ్చని, రాబోయే రెండు దశాబ్దాల్లో దాదాపు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.

కాలుష్య రక్కసిగా మారుతున్న ల్యాండ్‌ఫిల్‌లు
ప్రస్తుతం భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 1.71 లక్షల టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సగానికి పైగా తడి చెత్తే ఉంది. అయితే, ప్రస్తుతం ఇందులో కేవలం 61 శాతం వ్యర్థాలను మాత్రమే శుద్ధి చేయగలుగుతున్నారు. మిగిలిన చెత్త అంతా డ్రైనేజీల్లో, నగరాల శివార్లలోని ల్యాండ్‌ఫిల్‌లలో పేరుకుపోతోంది లేదా బహిరంగంగా తగలబెడుతున్నారు. 

ఈ ఓపెన్ బర్నింగ్ వల్ల నగరాల్లో ప్రాణాంతక ‘పీఎం 2.5’ (PM2.5) కాలుష్యం 10 శాతం పెరుగుతోంది. అంతేకాకుండా, కుళ్ళిపోయే తడి చెత్త నుంచి వెలువడే ‘మీథేన్’ వాయువు.. కార్బన్ డై ఆక్సైడ్ కంటే ప్రమాదకరంగా మారి పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. 1994 నుంచి 2020 మధ్య కాలంలో మన వ్యర్థాల రంగం ద్వారా వెలువడే ఉద్గారాలు ఏకంగా 226 శాతం పెరిగాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2047 నాటికి పట్టణ తడి చెత్త ఏటా 208 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది.

సంక్షోభం నుంచి సమృద్ధి వైపు.. 3 భవిష్యత్తు నమూనాలు
ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి సీఈఈడబ్ల్యూ మూడు రకాల ప్రణాళికలను (Scenarios) ప్రతిపాదించింది:

సాధారణ విధానం (Business-as-usual): ప్రస్తుతం ఉన్న పద్ధతులనే నెమ్మదిగా కొనసాగిస్తే, 2047 నాటికి వ్యర్థాల వల్ల వచ్చే కాలుష్య ఉద్గారాలు 120 మిలియన్ టన్నులకు చేరుకుంటాయి.

వేగవంతమైన విధానం (Accelerated Policy): నగరాల్లోని తడి చెత్తను వంద శాతం సేకరించి.. అందులో 95 శాతాన్ని కంపోస్టింగ్, బయోమెథనేషన్ ద్వారా శుద్ధి చేస్తే, కాలుష్య ఉద్గారాలను 68 మిలియన్ టన్నుల మేర తగ్గించవచ్చు.

ఆగ్రెసివ్ విధానం: పూర్తి స్థాయిలో బయోమెథనేషన్, బయో-సీఎన్‌జీ (Bio-CNG) ఉత్పత్తిపై దృష్టి పెడితే.. ఈ మార్కెట్ విలువ 62 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే కాకుండా 100 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను నిలువరించవచ్చు.

పట్టణాల్లో పోగయ్యే మొత్తం ఘన వ్యర్థాలలో వంటగది వ్యర్థాలు, కూరగాయల అవశేషాలు, పూలు, మాంసం వ్యర్థాలు, ఉద్యానవన వ్యర్థాలు వంటి సేంద్రియ వ్యర్థాలే దాదాపు సగం వరకు ఉంటాయని సీఈఈడబ్ల్యూ తన 'ఆర్గానిక్ వేస్ట్ సర్క్యులర్ ఎకానమీ ఫర్ వికసిత్ భారత్' నివేదికలో పేర్కొంది. ఈ వ్యర్థాలను కంపోస్ట్, బయోగ్యాస్, బయో-సీఎన్‌జీగా మార్చడం ద్వారా భారీ ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది.


26 లక్షల గ్రీన్ ఉద్యోగాలు
ఈ వ్యర్థాల ఆర్థిక వ్యవస్థలో ఊహించని స్థాయిలో ఉపాధి అవకాశాలు దాగి ఉన్నాయి. రోజుకు 100 టన్నుల సామర్థ్యం గల బయోమెథనేషన్ ప్లాంట్‌కు టెక్నీషియన్లు, కెమిస్ట్‌లు, లాజిస్టిక్స్ సిబ్బందితో కలిపి 31 మంది కార్మికులు అవసరమవుతారు. అదే స్థాయి కంపోస్టింగ్ ప్లాంట్‌కు 28 మంది అవసరం. ప్రభుత్వాలు సరైన పాలసీలతో ముందుకు వెళ్తే.. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న 4 లక్షల ఉద్యోగాల సంఖ్య 2047 నాటికి ఏకంగా 26 లక్షలకు పెరుగుతుంది. దీనివల్ల దేశంలో భారీ స్థాయిలో ‘గ్రీన్ వర్క్‌ఫోర్స్’ (పర్యావరణ అనుకూల కార్మికులు) తయారవుతారు.

అమలు కావాల్సిన నిబంధనలు.. సూచనలు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన భారతదేశ ‘ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2026’ (Solid Waste Management Rules, 2026) ప్రకారం.. హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు తమ తడి చెత్తను మూలం వద్దే వేరు చేసి, స్థానికంగానే శుద్ధి చేయడం తప్పనిసరి. దేశంలో స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్, గోబర్ధన్ (GOBARdhan), సతత్ (SATAT) వంటి 16 మంత్రాలయాల పరిధిలో అనేక పథకాలు ఉన్నప్పటికీ, వాటి మధ్య సమన్వయం లోపించడం పెద్ద మైనస్ అని నివేదిక ఎత్తిచూపింది.

కాంట్రాక్టర్లకు చెత్తను వేరు చేసిన క్వాలిటీ ఆధారంగా కాకుండా, తరలించిన క్వాంటిటీ (బరువు) ఆధారంగా డబ్బులు చెల్లించడం వల్ల మిశ్రమ చెత్తే డంపింగ్ యార్డులకు చేరుతోందని పరిశోధకులు తెలిపారు. దీనిని అధిగమించడానికి ఐదు ప్రధాన చర్యలు అవసరమని సీఈఈడబ్ల్యూ సిఫార్సు చేసింది.

పర్యావరణ, ఆరోగ్య ప్రయోజనాలు
ప్రస్తుతం చాలా నగరాల్లో చెత్తను బహిరంగంగా కాల్చడం వల్ల పీఎం 2.5 కాలుష్యంలో దాదాపు 10 శాతం వాటా ఉంటోంది. 1994 నుంచి వ్యర్థాల రంగం నుంచి వెలువడే గ్రీన్‌హౌస్ వాయువులు 226 శాతం పెరిగాయి. ఇది వాతావరణ మార్పులకు, పట్టణ వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతోంది. సరైన నిర్వహణతో ఈ వ్యర్థాలను వాహనాలకు అవసరమైన పునరుత్పాదక బయో-సీఎన్‌జీగా మార్చి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు.

ఈ నివేదికలోని అంశాలు ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, సతత్, గోబర్ధన్ వంటి పథకాల లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే, వ్యర్థాలను మూలం వద్దే వేరుచేయడంలో వైఫల్యం, నిధుల కొరత, సంస్థాగత సామర్థ్యం లేకపోవడం వంటివి పురోగతికి అడ్డంకులుగా ఉన్నాయని నివేదిక గుర్తించింది. నిబంధనల ప్రకారం, పట్టణ వ్యర్థాలలో 30-40 శాతం వాటా ఉన్న బల్క్ వేస్ట్ జనరేటర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

ఈ ప్రయోజనాలను పొందాలంటే వికేంద్రీకృత ప్రాసెసింగ్ యూనిట్లు, పటిష్టమైన వ్యర్థాల సేకరణ వ్యవస్థలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్పులు దేశ ఇంధన భద్రత, నికర శూన్య ఉద్గారాల లక్ష్యాలకు కూడా దోహదపడతాయని సీఈఈడబ్ల్యూ నిపుణులు అభిప్రాయపడ్డారు.

CEEW
Organic Waste
Waste Management
Solid Waste Management Rules 2026
Swachh Bharat Mission
GOBARdhan
SATAT
Bio-CNG
Green Jobs
India

More Telugu News